Wednesday, November 22, 2006

వాడు - వీడు వాడకము

మనుషుల మధ్య ఉన్న అంతరాలు దేవుడికి వర్తించవు. ఆయన మనందరికీ తండ్రి కనుక."డు" ప్రత్యయం ఎప్పుడూ అవమాన సూచకం కాదు. అసలది మొదలయిందే గౌరవసూచకంగా ! ఎలా అంటే -మొదట్లో, అంటే 2000 సంవత్సరాల క్రితం, తెలుగువారు కూడా తమిళుల్లాగా రామన్, కృష్ణన్ అనేవారు. తరువాత అది సమంజసంగా అనిపించక గౌరవ సూచకంగా ఒక "రు" చివరిలో చేర్చి రామన్ఱు కృష్ణన్ఱు అనడం మొదలుపెట్టారు. అవే తరువాత రామండు కృష్ణండు అయి ఇంకా తరువాతి కాలంలో రాముండు కృష్ణుండు అయ్యాయి.

ఇంకో విషయం. వాడు వీడు అనేవి కూడా మొదట్లో అవమాన సూచకాలు కావు. అవి ఈనాటి "ఆయన, ఈయన" తో సమానం.కాలక్రమంలో వాడగా వాడగా చేదయ్యాయి. మాలల్ని మొదట హరిజనులని తరువాత అది కూడా వెగటుపుట్టి ఇప్పుడు దళితులంటున్నట్లు.అలాగే "అది, ఇది" అని స్త్రీలని ఈరోజు సంబోధిస్తే చాలా గొడవలవుతాయి. కాని మొదట్లో స్త్రీలింగానికి సర్వనామాలు అవే.వాటిని దేవతలకీ పతివ్రతలకీ కూడా అన్వయించి ప్రయోగించి ఉండడం మనం పాత తెలుగు కావ్యాల్లో గమనించవచ్చు.

ఇప్పుడు వాడుకలో ఉన్న ఆమె ఈమె అనేవి 19వ శతాబ్దానికి ముందు వాడుకలో లేవు. ఇవి నిజానికి సంధి రూపాలు. ఆ యమ్మ ఆమె అయింది.ఈ యమ్మ ఈమె అయింది.అలాగే ఆ బిడ్డ ఆవిడ అయింది. ఈ బిడ్డ ఈవిడ అయింది. అలాగే ఆ యన్న ఆయన అయ్యాడు. ఈ యన్న ఈయన అయ్యాడు.

ఈ ఆధునిక సర్వనామాలకి బహువచన రూపాలు (ఆమెలు, ఈమెలు, ఆవిడలు, ఈవిడలు, ఆయనలు, ఈయనలు మొదలైనవి)లేకపోవడమే ఇవి ఇటీవలి సృష్టి అని సూచిస్తోంది.
----------------------------------------------------
రచయిత: తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
http://www.telugusaahityam.blogspot.com